Saturday, October 1, 2016

ఆపద్బాంధవుడు ( కవిత)

అందరి రాతల్ని, తలరాతల్నీ
అనుబంధాల వరసలో
దారం ఆధారంతో కలిసికట్టగా కట్టి
కొత్త పెళ్లికొడుకును గుర్రం మీద ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్టు
సైకిల్ వెనుక సీట్లో వాటిని బాధ్యతగా కూర్చోబెట్టుకుని
అతడు వీధుల వెంట విహారిలా సాగిపోతుంటాడు
అతడి పిలుపులో కొన్నిసార్లు ఆత్మీయతరంగాలు
స్వరరాగఝరులై ప్రవహిస్తాయి.
మరికొన్నిసార్లు అగ్నిపర్వతాలు బద్ధలై
సునామీకెరటాల్లా విరుచుకు పడతాయి.
అన్ని రుతువుల్లో ,అన్ని కాలాల్లో
సకలజనుల సముదాయాల్లోనూ
అక్షరనదిలా ప్రవహిస్తూ …
ఇంటింటికీ ప్రేమపత్రహరితమవుతాడు
అమ్మలెందరికో పుత్రరత్నమవుతాడు
వృత్తిధర్మపు యోగ్యతాపత్రమవుతాడు
ఉభయకుశలోపరిలో పరోపకారిలా ఉత్తరప్రత్త్యుత్తరమవుతాడు
చిరునామాలన్నీ అతడి మస్తిష్కపు లాకర్లో
చిరునవ్వుల మొహాలన్నీ అతడి మనసు పొరల్లో
అతిభద్రంగా నిక్షిప్తమై వుంటాయి
తోకలేనిపిట్టలతో చెట్టాపట్టాలేసేకుని వొచ్చి
ప్రతి యింటిగుమ్మం ముందు కాకమ్మలా వాలిపోతాడు
అతడి రాక కొందరికి సిరివెన్నెల ఏరువాక
మరికొందరికి గోదావరిలో పడవ మునక
విసుగు విరామం తెలియని బహుదూరపు బాటసారి
చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న కలల బికారి
కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నా
చెక్కుచెదరని చిరునవ్వుల్ని సరిగమలుగా పలకరించి
ప్రతి ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గులా మెరుస్తాడు
నా తమ్ముడికి విదేశీ ఉద్యోగాన్నీ
నా చెల్లెలికి వివాహ సంబంధాన్నీ
ఉత్తరమై మోసుకొచ్చిన ఆత్మబంధువు
చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో
మనియార్డరును అందించి ఆదుకునే ఆపద్బాంధవుడు
మిత్రులారా….
అతడి గురించి ఇంకా ఏమని చెప్పను ?
అతడు ఆనందాల్ని, విషాదాల్నీ
భుజాన వేసేకుని తిరిగే  పరమశివుడు
ప్రపంచాన్ని భరిస్తూ సేవామృతం పంచుతున్న అపర భగీరథుడు
( నా చిన్నతనంలో నేను చూసిన పోస్ట్ మేన్ స్మృతిలో....)